చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోకి చేరి వరిపంటలను నాశనం చేశాయి. ఐతే ఈ ఘటన వెనుక ఓ విషయం దాగి ఉంది. ఇటీవల మొగిలివారిపల్లెలో... పంట పొలాల్లో తీగలు తగిలి విద్యుదాఘాతంతో... ఓ ఏనుగు మృతిచెందింది. అటవీశాఖ అధికారులు ఆ ఏనుగు కళేబరాన్ని 15 అడుగుల గొయ్యి తీసి ఖననం చేశారు.
ఆ ఏనుగు కనిపించక పోవటంతో మరుసటి రోజు అర్ధరాత్రి తోటి గజరాజులు ఊరిలోకి వచ్చాయి. తెల్లవారుజాము వరకు... ఏనుగును పూడ్చి పెట్టిన ప్రదేశంలో తిరిగుతూనే ఉన్నాయి. అనంతరం ఖననం చేసిన స్థలంలో మట్టిని తోడేశాయి. ఎంతకీ లాభం లేకపోవటంతో చుట్టుపక్కల ఉన్న వరి పంటలను ధ్వంసం చేశాయి. తోటి ఏనుగు పట్ల వాటి ప్రేమను చాటుకున్నాయి.
ఇదీ చూడండి: మహిళను రక్షించి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్