డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ లాంటి మేధస్సు కలిగినవాడు లక్ష్మీపతి. తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోబోటిక్ సైంటిస్ట్ అయ్యి సైన్యంలో దేశం కోసం చనిపోతున్న వారిని కాపాడాలని భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్నాడు. బాలుడి ప్రతిభకు ఉపాధ్యాయులు సైతం సలాం అన్నారు. టీచర్లు, వార్డెన్లు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు సహకారంతో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ అవార్డు తీసుకున్నాడు. ఇక చేసిన ప్రయోగాలు, పొందిన బహుమతులు గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఈనెల 27 నుంచి 31 వరకు చెన్నైలో జరిగే వైజ్ఞానిక జాతీయ సదస్సులో పాల్గొనాల్సిన లక్ష్మీపతి.. హఠాత్తుగా అనారోగ్యంతో స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు.
బాలుడు ప్రతిభ గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దగ్గరుండి తన ప్రయోగాలకు అయ్యే ఖర్చును సమకూర్చేవారు. తమ పాఠశాల నుంచి ఒక శాస్త్రవేత్త వెళ్తున్నాడన్న ఆనందం విద్యార్థి హఠాన్మరణంతో అంతలోనే ఆవిరయ్యింది. ఇక పాఠశాల ఉపాధ్యాయిని అయితే కన్న కొడుకును కొల్పోయానంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
అనాథ అయినా తమలో ఒకడిగా
లక్ష్మీపతి అనాథ అయినప్పటికీ.. అలాంటి అలోచనే లేకుండా... ఎప్పుడూ ప్రయోగాలు, స్నేహితులతో కలివిడిగా ఉండేవాడంటూ వాపోతున్నారు. ఒక మేథావిని కోల్పోయామన్న నిజాన్ని జీర్ణించికోలేని విద్యార్థులు, ఉపాధ్యాయులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఏ లోకంలో ఉన్నా.. ఆ బాల మేధావి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.