సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్ల సమక్షంలో ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. వందమంది కూలీలు, జేసీబీలు, ఇతర వాహనాలతో కూల్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫర్నీచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్ సామగ్రిని నిన్న సాయంత్రమే తరలించారు. భవనంలో ఉన్న సామగ్రిని సచివాలయానికి అధికారులు తరలించారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి పంపించారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సగానికిపైగా ప్రజావేదిక కూల్చివేత పనులు పూర్తయ్యాయి. అమరావతిలో వర్షం కురుస్తోంది. జోరువానలోనూ ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
ప్రజల ఇబ్బందులు
చంద్రబాబు కూడా విదేశాల నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజావేదిక పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరకట్ట వైపు ప్రజలను పోలీసులు అనుమతించడం లేదు. ప్రజావేదిక కూల్చివేత జరుగుతోందంటూ బ్యారేజీ వద్దే నిలిపివేస్తున్నారు. కరకట్ట వైపు అనుమతించకపోవడంపై పోలీసులతో ప్రజల వాగ్వాదం చేసుకున్నారు. ఆలయానికి కూడా వెళ్లనీయడం లేదని పోలీసులపై స్థానికుల మండిపడుతున్నారు.