కొన్ని రోజులుగా ఈసీకి అనేక ఫిర్యాదులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి ఏమిటి సమస్య అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలింగ్‌లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యతన్న చంద్రబాబు... తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని స్పష్టం చేశారు. దీనికి ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే మరింత పెద్దదవుతుందని హెచ్చరించారు.
ప్రతి అసెంబ్లీ స్థానంలో 5 వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని... సుప్రీంకోర్టులో ఈసీ ఇచ్చిన సమాధానం సరైంది కాదని విపక్షాలు ఆరోపించాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారన్న విపక్ష నేతలు... వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీ వెనకడుగు వేయడానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు నిబంధనలు రూపొందించలేదని... 5 వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. వీవీప్యాట్ల లెక్కింపులో సమస్యలొస్తే ఈసీకి సంబంధం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. ఆర్‌వో, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వ్యత్యాసంపై ఈసీ ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు.
చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు పూర్తి కాకుండా ముందుగానే వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని విపక్షాలు కోరాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకగా జరపాలని... కౌంటింగ్ జరిగేటప్పుడు లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. లెక్కింపు ముగిసేవరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, రికార్డులను కౌంటింగ్ కేంద్రంలోనే ఉంచాలని కోరాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన 16.1 క్లాజును మాన్యువల్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి...