ఆర్థిక మంత్రి బుగ్గన విడుదల చేసిన శ్వేతపత్రంపై ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "2018-19 నాటి బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.49 లక్షల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి వారం క్రితం పార్లమెంటులోనూ ఇదే విషయం చెప్పారు. మీరేమో రాష్ట్రానికి రూ.3.62 లక్షల కోట్లు అప్పు ఉందని అంటున్నారు. ఒకేసారి లక్షా 13 వేల కోట్ల అప్పు ఎలా పెరిగింది? ఈ 45 రోజుల్లో మీ ప్రభుత్వమేమైనా చేసిందా?" అని లోకేశ్ ప్రశ్నించారు.
అప్పు ఎక్కువ చూపించి ఏం చెప్పదలచుకున్నారు.. వైకాపా ప్రభుత్వాన్ని లోకేశ్ అని నిలదీశారు. హామీల నుంచి తప్పించుకునేందుకే అప్పుల బూచి చూపిస్తున్నారని ఆరోపించారు. "మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగారు. ముందుగా ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపే జీఎస్డీపీని లెక్కించడం దేశమంతా ఉంది. మీకది కొత్త విషయం అంతే" అని లోకేశ్ ఎద్దేవా చేశారు.