తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం ముగిసింది. సుమారు 3గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో రాజధాని వ్యవహారంతో పాటు అన్ని అంశాలపైనా సీఎం చర్చించినట్లు మంత్రి బొత్స తెలిపారు. ల్యాండ్ పూలింగ్, నిర్మాణాలు, భూకేటాయింపుల్లో పెద్ద కుంభకోణం జరిగినట్లు బొత్స తెలిపారు. ఏ అంశాన్ని చూసినా పెద్ద కుంభకోణం కనిపిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం అవినీతి కూపంలా మారిందని.. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు బొత్స తెలిపారు.
సీఆర్‌డీఏ పరిధిలోని ప్రతిపనిలో అవినీతి జరిగిందన్న మంత్రి.. రైతులకు ప్లాట్ల కేటాయింపు, పనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. ప్లాట్ల కేటాయింపుల్లో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందన్న మంత్రి... వంద రూపాయలతో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారన్నారు. అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అవినీతి కూపం నుంచి బయటపడ్డాకే రాజధాని అభివృద్ధిపై దృష్టి సారిస్తామని బొత్స అన్నారు. గత ప్రభుత్వ అవినీతి పనులను కొనసాగించేది లేదన్నారు. బలవంతం వల్ల భూమి కోల్పోయిన వాళ్లు కోరితే మళ్లీ భూమి తిరిగిస్తామని తెలిపారు. బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని అన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయని బొత్స స్పష్టం చేశారు. ప్రజావేదిక నుంచే ప్రక్షాళన ప్రారంభమైందని.. అక్రమ నిర్మాణాల అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. త్వరలోనే మరోసారి సీఆర్‌డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.