తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో సున్నా వడ్డీకి సంబంధించిన కొన్ని ఆధారాలను చంద్రబాబు బయటపెట్టారు. 2014 నుంచి 2018 వరకు తమ ప్రభుత్వం రూ. 930కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు రికార్డులు మీడియా ముందుకు తెచ్చారు. 43లక్షల 70వేల మందికి ఈ మొత్తం ఇచ్చామని వెల్లడించారు. 2014కు ముందు బకాయి ఉన్న డబ్బులు కూడా బ్యాంకులకు చెల్లించామని తెలిపారు. 2018-19 మాత్రమే 560 కోట్లు పెండింగ్లో ఉందని... దీనిపై ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అడిగితే తెదేపా ప్రభుత్వానివి మేం ఎందుకు ఇవ్వాలని జగన్ సమాధానం ఇచ్చారని తెలిపారు. రికార్డులు ఎవరూ చేతిలో పెట్టుకోరని... అన్నీ సేకరించి సభలో పెట్టేసరికి వాయిదా వేశారని అన్నారు. సున్నా వడ్డీ అనేది కొత్తదేమీ కాదని.. పాత పథకానికి పేరు మార్చారని స్పష్టం చేశారు.
జగన్‌కు అసలు సబ్జెక్ట్ తెలియదని.. నేర్చుకోవాలనే తపన కూడా లేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల మనోభావాలు దెబ్బతీసి కించపరచేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంభావంతో రాజకీయ ఉగ్రవాదం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
సంబంధిత కథనం.. తప్పని తేలితే.. చంద్రబాబు రాజీనామా చేస్తారా..? జగన్