అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రజలు, తెదేపా నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నియోజకవర్గాన్ని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని కోరారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తెదేపా మాజీ ఎమ్మెల్యే ఈరన్న... ప్రస్తుత ముఖ్యమంత్రి పరిపాలన తుగ్లక్ పాలనకు నిదర్శనంగా మారిందని అన్నారు.
'మడకశిర నియోజకవర్గం నుంచి విశాఖ దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటిస్తే మేము అక్కడికి చేరుకోవాలంటేనే రెండు రోజులు పడుతుంది. బెంగళూరు మహా నగరం కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మడకశిర నియోజకవర్గ ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్ర భూభాగంలో కలిపితే మాకు కష్టాలు ఉండవు' అని ఈరన్న అన్నారు. లేదంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.