చాలా ఏళ్ల తరువాత జలకళ సంతరించుకోవడంతో... ఆ ప్రాంత అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబిగానిపల్లి గ్రామం కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. ఓబిగానిపల్లి సమీపంలో నదిని తలపించే పెద్ద వాగు ఉంది. కానీ ఆ గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు... పక్కనే ఉన్న బెంగళూరుకు వలస వెళ్లారు. 24 ఏళ్ల క్రితం వాగులు ప్రవహించి, భూగర్భ జలాలు పెరిగి రెండేళ్లపాటు వ్యవసాయం చేసుకున్నామని అక్కడి రైతులు చెబుతున్నారు.
క్రమేపీ భూగర్భ జలాలు అడుగంటడంతో దిక్కుతోచక వలస పోయామని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు సంవృద్ధిగా కురిసి... జలకళ సంతరించుకున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎండిపోయిన బోర్ల నుంచి నీరు వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో వలసలు ఉండవని, వ్యవసాయంతో పాటు అనుబంధ కార్యక్రమాలపై దృష్టి పెడతామని అన్నదాతలు చెబుతున్నారు. తమ గ్రామం నుంచి జలసిరి పెంచినందుకు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చదవండీ... పాట పాడేందుకు నిరాకరించాడని వివాహిత ఆత్మహత్య..!