వైకాపా నేతలు అట్రాసిటీ కేసులు పెట్టి తెదేపా నేతలను బెదిరిస్తున్నారని... ఆత్మకూరులో 130 మందిని ఊరినుంచి తరిమేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపా కార్యకర్తలను పోలీసులు దారుణంగా వేధిస్తున్నారని.. కొందరు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సీఐ భక్తవత్సలరెడ్డిపై ప్రైవేటు కేసు వేశామని తెలిపారు. వైకాపా బాధితుల కోసం పునరావాస కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహించారు. వారిని పరామర్శించేందుకు తాను ఆత్మకూరు వెళ్లకుండా ఇంటిగేటుకు తాళ్లు కట్టారని విమర్శించారు.
సామాన్యుల పరిస్థితి ఏంటి?
తననే అడ్డుకుంటున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తమ పార్టీ నేత కోడెలను ఎన్నో రకాలుగా వేధించారనీ.. చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమించే పోలీసు అధికారులకు జైలుశిక్షలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి తన ఆస్తులను పెంచుకుంటూ.. తెదేపా నేతల ఆర్థిక మూలాలపై దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షనేత విమర్శించారు.
ఊరుకోను.. తిరిగిచ్చేస్తా
తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ఉద్ఘాటించారు. బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం కట్టించే పూచీ తనదని హామీ ఇచ్చారు. దమ్ముంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలనీ.. అంతేకాని పోలీసులను చూపించి భయపెట్టాలని చూస్తే ఊరుకోమన్నారు. తప్పు చేసిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టనని హెచ్చరించారు. అణచివేయాలని చూస్తే తెదేపా కార్యకర్తలు మరింత రెచ్చిపోతారన్నారు. 20 ఏళ్ల కేసులు తిరగతోడి తెదేపా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: