మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ ఒప్పందం మేరకు.. అనంతపురం అరటిని విదేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు... పుట్లూరు మండలం కడవకల్లు నుంచి.... ఎగుమతులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
అరటి ఎగుమతుల ప్రారంభంతో.... అనంతపురం జిల్లాను ఉద్యాన హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడినట్లైంది. జిల్లాలో దిగుబడయ్యే... పండ్లు, పూలు, కూరగాయలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రత్యేక వాతావరణంలో పండించే ఉత్పత్తులకు నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు నిర్ధరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం జిల్లా ఉద్యాన రైతులకు కలిసొచ్చే.. చర్యలు చేపట్టింది.
మూడేళ్ల క్రితం... ఐఎన్ఐ ఫామ్స్‌తో పాటు.. దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ అనే గుజరాతీ కార్పొరేట్ సంస్థతో ఎగుమతి ఒప్పందం చేసుకుంది. ప్రమాణాల మేరకు అరటిపండ్లు దిగుబడి సాధించేలా రైతులకు ఆ సంస్థలు శిక్షణనిచ్చాయి. రైతులకు అవసరమైన సాగు ఉత్పాదకాలు, రాయితీలను ప్రభుత్వం అందించింది. మూడేళ్లుగా ఈ రెండు సంస్థలు.. రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల అరటిని కొనుగోలు చేసి.. దేశీయ మార్కెట్‌కు తరలించారు. ఇప్పుడు విదేశీ మార్కెట్ ప్రమాణాలకు తగిన నాణ్యతతో దిగుబడి వస్తుండటంతో.. ఇరాన్ సహా పలు దేశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు. తొలి విడతలో 680 మెట్రిక్ టన్నుల అరటిని ఇరాన్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
అనంత జిల్లా వ్యాప్తంగా 16 వేల హెక్టార్లలో రైతులు ఈ జీ-9 రకం అరటిని సాగుచేస్తున్నారు. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా సాగుచేసే.. ఈ రకం అరటికి.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. జిల్లాలో సాగుచేసే ఈ పండ్లకు ఎక్కువ రోజులపాటు నిల్వ సామర్థ్యం ఉండటంతో.. ఇక్కడి నుంచి కొనుగోలు చేసి విదేశాలకు పంపాలని కార్పొరేట్ సంస్థలు భావించాయి. నేటి నుంచి రైతుల తోటల వద్దే... ప్యాకింగ్ చేసి... నేరుగా కంటైనర్లకు లోడ్ చేయనున్నారు. పుట్లూరు, యల్లనూరు సహా పలు మండలాల్లో.. అరటిని కంటైనర్లకు ఎక్కించి.. లారీల ద్వారా తాడిపత్రి రైల్వేస్టేషన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ముంబయి ఓడరేవుకు తరలించి... సముద్ర మార్గం ద్వారా... ఇరాన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో... ముంబై వెళ్లే కంటైనర్ల రైలును... మంత్రి కన్నబాబు జెండా ఊపి సాగనంపనున్నారు.
ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్న చిరకాల వాంఛ నెరవేరడంతో... జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ తరహాలోనే... ఇతర వ్యవసాయ, పాల ఉత్పత్తులను కూడా పొరుగు దేశాలకు ఎగుమతి చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు.
ఇదీ చదవండి: పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?