వస్తు సేవల పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రూ.964.88 కోట్లు వసూలుతో 41.88 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే సమయానికి రూ.680 కోట్లు వసూలైంది. 30.24 శాతం వృద్ధితో ఏలూరు ద్వితీయ స్థానం దక్కించుకుంది. జిల్లాలో కియా మోటారు కార్ల పరిశ్రమ ఏర్పాటు, నిర్మాణ రంగం, వాహన తనిఖీలు, డీలర్లు సకాలంలో రిటర్నులు దాఖలు చేసేలా చూడటం, సెన్సిటివ్ కమోడిటీస్ అక్రమ రవాణాపై నిఘా తదితర చర్యలతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. పన్ను రాబడిలో ఆటో మొబైల్ పరిశ్రమ (కియా కంపెనీ ) సింహభాగం. తరువాత నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీలు, సిమెంటు, గ్రానైట్, వంట నూనెలు, దుస్తుల పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి పన్ను సమకూరుతోంది. వస్తు సేవల పన్ను చట్టం కింద జిల్లాలో 28 వేల మంది డీలర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.
"రిజిస్ట్రేషన్ చేసుకున్న డీలరు ప్రతినెలా రిటర్నులు దాఖలు చేసేలా చూస్తున్నాం. అక్రమంగా సరకు రవాణా జరగకుండా వాహన తనిఖీలు ముమ్మరం చేశాం. గత నెల నుంచి తనిఖీలు ముమ్మరం చేయడంతో రూ.40 లక్షల పన్ను, అపరాధ రుసుం వసూలైంది. బంగారం, గ్రానైట్, ఫర్నిచర్, ఫ్లైవుడ్, స్టీలు, హార్డ్‌వేర్, వంటనూనె, జువెలరీ, మార్బుల్స్.. ఇలా దాదాపు 23 రకాల సరకులను సెన్సిటివ్ కమోడిటీస్ కింద పరిగణించి రవాణాపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. "- శ్రీనగేష్, జేసీ, వాణిజ్య పన్నుల శాఖ
నిబంధనలు కఠినతరం...
జీఎస్టీ వసూళ్లలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. రూ.40 లక్షలకు పైబడి వ్యాపార లావాదేవీలున్న వారు జీఎస్టీ పరిధిలోకి వస్తారు. రూ.50 వేలకు మించి ఖరీదు చేసే సరకు రవాణాకు వేబిల్లు అవసరం లేదు. ఆపై సరకు రవాణాకు వేబిల్లు ఉండాల్సిందే. జీఎస్టీ కొత్తగా అమల్లోకి వచ్చినప్పుడు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని కొందరు డీలర్లు దుర్వినియోగం చేయడంతో ప్రభుత్వానికి పన్ను నష్టం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలు చేసింది. ఈ క్రమంలో డీలరు ఏ జిల్లాలో వ్యాపారం చేస్తారో అదే జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నిబంధన. ఆధార్, పాన్ కార్డుల వివరాలు, వ్యాపార స్థలం తదితర వివరాలు నమోదు చేసిన తర్వాత సంబంధిత సర్కిల్ పరిధిలోకి వస్తారు. సర్కిల్ సీటీఓ వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ అనుమతి ఇస్తారు. ఆన్‌లైన్లో నమోదు చేసిన వివరాల్లో తేడాలుంటే రిజిస్ట్రేషన్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇదీ చదవండి