ఒలింపిక్స్ కోసం నిర్వహించే బాక్సింగ్ ట్రయల్స్ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, ఆ బౌట్‌లకు టీవీల్లో లైవ్ పెట్టించాలని హైదరాబాదీ యువ బాక్సర్ నిఖత్ జరీన్ భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)ను డిమాండ్ చేసింది.
"మేరీతో మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండగా.. ఆమె ఆడట్లేదని చివర్లో తెలిసింది. ఈ బౌట్ టీవీల్లో అందరూ చూస్తారు కాబట్టి నా ప్రతిభ తెలుస్తుందనుకున్నా. ఆ అవకాశం లేకపోయింది. ఒలింపిక్ ట్రయల్స్ మాత్రం కచ్చితంగా లైవ్‌లో ప్రసారం చేయాలి. ప్రజలకు బౌట్‌లో ఏం జరిగిందో తెలియాలి" - నిఖత్ జరీన్, బాక్సర్
నిబంధనలకు విరుద్ధంగా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను నేరుగా ఒలింపిక్స్ అర్హత టోర్నీకి పంపాలన్న అధికారుల నిర్ణయాన్ని నిఖత్ సవాలు చేయడంతో.. ఈ నెల 27, 28 తేదీల్లో ట్రయల్స్‌లో మేరీ పాల్గొనక తప్పని పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే.
51 కేజీల విభాగంలో ట్రయల్స్ కోసం జ్యోతి, రితు, మేరీకోమ్ ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో బెర్తు కోసం నిఖత్, పింకీ రాణిల మధ్య పోటీ నెలకొంది. శనివారం వీరి మధ్య బౌట్‌లో విజేత ట్రయల్స్‌కు అర్హత సాధిస్తారు.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్‌నకు నాలుగు నెలల ముందే సిద్ధమా..?