వెస్టిండీస్‌తో కటక్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. కరీబియన్ జట్టు నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ 85 (81 బంతుల్లో; 9ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో పాటు ఓపెనర్లు రోహిత్‌శర్మ(63), కేఎల్ రాహుల్(77) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో జడేజా(39), శార్దుల్ ఠాకుర్(17) ధాటిగా ఆడడం వల్ల భారత్ మ్యాచ్ గెలిచింది. ఫలితంగా 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'... రోహిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' లభించాయి. ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన గెలుపును అందుకుని సంవత్సరాన్ని ఘనంగా ముగించిన టీమిండియా.. పలు రికార్డులనూ ఖాతాలో వేసుకుంది.
రికార్డులివే...
- మూడో వన్డేలో ప్రదర్శనకుగానూ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది మొత్తం 9 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ కూడా 9 అవార్డులతో నిలిచాడు.
- అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు అందుకున్న మూడో ఆటగాడిగా కలిస్ సరసన నిలిచాడు కోహ్లీ. ఈ జాబితాలో సచిన్(76), జయసూర్య(58), కోహ్లీ(57*), కలిస్(57) వరుసగా ఉన్నారు.
- వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో భారత్‌కి ఇది వరుసగా పదో విజయం. ఓ ప్రత్యర్థిపై ఎక్కువ వరుస సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. గతంలో విండీస్, శ్రీలంక జట్లపై వరుసగా తొమ్మిది సిరీస్‌లు గెలుపొందిన రికార్డును తానే సవరించుకుంది.
- ఎక్కువసార్లు 300 పైగా పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది భారత్. ఇప్పటివరకు 19సార్లు భారీ స్కోరును బ్రేక్ చేసింది. ఇంగ్లాండ్(11), ఆస్ట్రేలియా(10), శ్రీలంక(10) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- కోహ్లీ ఛేదనలో రారాజుగా తన రికార్డు కాపాడుకుంటున్నాడు. విండీస్‌పై ఆఖరి 6 వన్డే ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు, ఒక అర్ధశతకం సాధించాడు.
- ఈ ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు 50కి పైగా స్కోరు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సాధించాడు. మూడో వన్డేలో అర్ధశతకం చేసిన ఈ టీమిండియా సారథి.. 21 హాఫ్ సెంచరీలతో నిలిచాడు. రోహిత్ (20) తర్వాతి స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో మాత్రం హిట్‌మ్యాన్(13)తో అగ్రస్థానంలో, కోహ్లీ(12) అర్ధశతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
- టీమిండియా 300కి పైగా లక్ష్య ఛేదన చేసిన సందర్భాల్లో కోహ్లీ గణంకాలను పరిశీలిస్తే.. 31 ఇన్నింగ్స్‌ల్లో 62.25 సగటుతో 1,743 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు ఉండగా 6 అర్ధ శతకాలున్నాయి. కాగా 2012లో పాకిస్థాన్‌పై అత్యధిక స్కోర్ 183 పరుగులు చేశాడు.
- వరుసగా నాలుగో ఏడాది విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు) అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. 2016లో 2,595... 2017లో 2,818... 2018లో 2,735... 2019లో 2,455 పరుగులు చేశాడు.
- వన్డే కెరీర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మరో స్థానం ఎగబాకాడు. 7వ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు కలిస్(11,579)ను వెనక్కి నెట్టి.. ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ 11,609 పరుగులతో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్, సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేల జయవర్దనే, ఇంజమామ్ ఉల్ హక్ ముందు వరుసలో ఉన్నారు.
2019లో ఓపెనర్‌గా రోహిత్‌శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి చేసిన పరుగులు 2,441. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 1997లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 2,387 పరుగులు చేశాడు. ఫలితంగా 22 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న జయసూర్య రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
- మూడో వన్డేలో ప్రదర్శనతో రోహిత్.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు (1,490) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం ఈ సంవత్సరం 28 వన్డేలు ఆడాడు. ఇందులో 7 శతకాలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి తర్వాత కోహ్లీ 1,377 పరుగులతో రెండో స్థానంలో, విండీస్ క్రికెటర్ షై హోప్(1,345) మూడో స్థానంలో నిలిచారు.
- 2019లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ ఘనత సాధించాడు. ఈ లిస్టులో కోహ్లీ(2,447), రోహిత్(2,442), పాకిస్థాన్‌కు చెందిన బాబర్(2,082) వరుసగా ఉన్నారు. టాప్-3 ఆటగాళ్లు ఉపఖండ ప్లేయర్లే కావడం విశేషం.
ఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ నవదీప్ సైనీ భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఘనత సాధించిన 229వ క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా సైనీతో సహా ఈ ఏడాది ఐదుగురు ఆటగాళ్లు భారత తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశారు. వారిలో సిరాజ్, విజయ్ శంకర్, శుబ్‌మన్ గిల్, శివమ్ దూబే ఉన్నారు.