బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. ఆనందం పట్టలేకపోతున్నాడు. తను అద్భుతమైన భోజనం రుచి చూశానని, ఈ ఆతిథ్యం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నాడు. అయితే ఇక్కడ అతడి కుటుంబం కోసం వండింది సాదాసీదా వ్యక్తి కాదు. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఈ విషయాన్ని మొత్తం తన ఫేస్బుక్లో రాసుకొచ్చాడు.
అసలేం జరిగింది?
బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇంటికి కొద్దిరోజుల క్రితం షకిబ్ భార్య వెళ్లింది. ఆమె అక్కడే భోజనం చేసింది. ఆ సమయంలో ఆమె కొన్ని పదార్థాలను ఇష్టంగా తినడం చూసిన హసీనా.. ఆ విషయం గుర్తుంచుకున్నారు. వాటిని స్వయంగా వండి, షకిబుల్ ఇంటికి ఆదివారం ఉదయం పంపించారు. ఆశ్చర్యపోయిన షకిబ్.. తన ఆనందాన్ని ఫేస్బుక్ వేదికగా పంచుకున్నాడు. సంబంధిత ఫొటోలను పోస్ట్ చేశాడు.
ప్రధాని హసీనా వేరొకరికి వండిపెట్టడం ఇదేం కొత్తం కాదు. 2017లో ఆమె దిల్లీ సందర్శించినపుడు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం హిల్సా అనే వంటకాన్ని తయారు చేశారు.