సెడాన్ పార్క్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 టై అయింది. కచ్చితంగా నెగాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. గప్తిల్(31),మన్రో(14), టేలర్(17) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ రెండు వికెట్లు, చాహల్, జడేజా ఒక్కో వికెట్ సాధించారు.
రోహిత్ మెరుపులు...
మూడో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు మంచి లక్ష్యమే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ (65; 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (27; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) అతడికి తోడుగా నిలిచాడు. వీరిద్దరి జోరుతో 8 ఓవర్లకే స్కోరు 82కు చేరుకుంది.
అద్భుతంగా ఆడుతున్న ఓపెనింగ్ జోడీని రాహుల్‌ను ఔట్ చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్ విడదీశాడు. అప్పుడు స్కోరు 89. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె (3) నిరాశపరిచాడు. జట్టు స్కోరు 94 వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (17)తో కలిసి విరాట్ కోహ్లీ (38; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శాంట్నర్ ఊరించేలా వేసిన 16.6వ బంతికి శ్రేయస్ స్టంపౌట్ అయ్యాడు. బౌండరీలు బాదుతూ ఊపుమీదున్న కోహ్లీ కూడా మరికాసేపటికే పెవిలియన్ చేరాడు.
న్యూజిలాండ్ డెత్ ఓవర్లను కట్టుదిట్టంగా విసరడం వల్ల స్కోరు 180 దాటుతుందా అని సందేహం కలిగింది. ఆఖర్లో మనీశ్ పాండే (14; 6 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్), రవీంద్ర జడేజా (10; 5 బంతుల్లో 1 సిక్సర్) మెరవడం వల్ల స్కోరు 179కి చేరుకుంది. కివీస్‌లో హమిష్ బెన్నెట్ 3 వికెట్లు తీశాడు. శాంట్నర్, గ్రాండ్‌హోమ్‌కు చెరో వికెట్ దక్కింది.