ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ లేదా పునరాగమనంపైనే చర్చ. అయితే మహీని మళ్లీ వన్డేల్లో చూడలేకపోవచ్చు. అతడు టీ20ల్లో మాత్రమే ఆడే అవకాశముందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. బహుశా మహీ.. అదే అనుకుంటున్నాడేమోనని అభిప్రాయపడ్డాడు.
"మహీ విరామం తీసుకోవడం తెలివైన ఆలోచనే. అతడు మళ్లీ ఎప్పుడు ఆడతాడో అని నేనూ ఎదురుచూస్తున్నా. నాకు తెలిసి మహీ వన్డేలు ఆడతాడని అనుకోవడం లేదు. టెస్టు క్రికెట్కు ఇంతకు ముందే వీడ్కోలు చెప్పాడు. ఇక అతడి ముందున్న ఆప్షన్ టీ20 మాత్రమే. తొలుత నిరూపించుకుంది ఈ ఫార్మాట్లోనే. అయితే అతడి ఫిట్నెస్ సహకరించే విషయంపైనే మహీ నిర్ణయం ఆధారపడి ఉంది" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్
94 టెస్టులు ఆడి వంద టెస్టులు ఆడకుండా ఎంతమంది రిటైర్మెంట్ ఇచ్చారు? అని ప్రశ్నించాడు రవిశాస్త్రి.
"100 శాతం ఫిట్నెస్ లేదనుకుంటే జట్టుకు భారం కాకుడదని ధోనీనే రిటైర్మెంట్ తీసుకుంటాడు. 94 టెస్టులు ఆడి 100 మ్యాచ్లు ఆడకుండా ఎంతమంది రిటైర్మెంట్ ప్రకటించారు? కానీ మహీ నిశ్శబ్దంగా 5 రోజుల ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాడు. అయితే అతడు ఐపీఎల్లో తప్పక ఆడతాడు. మహీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో ఈ మధ్యనే చూశా" - రవిశాస్త్రి, టీమిండియా కోచ్
ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు దూరంగా ఉన్నాడు.
ఇదీ చదవండి: తొలి వన్డే: టాస్ గెలిచిన విండీస్.. భారత్ బ్యాటింగ్