ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ అనూహ్య నిష్క్రమణ.. భారత్‌లోని సగటు క్రికెట్ అభిమాని ఆశలనూ ఆవిరి చేసింది. అంత త్వరగా ఈ ఓటమి నుంచి బయటకు రాలేకపోయారు ప్రేక్షకులు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచకప్ పరాభవం ఇంకా వెంటాడుతూనే ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు కోహ్లీ.
నిజాన్ని అంగీకరించాల్సిందే..
ఈ ఓటమి నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. పరాజయం ప్రభావం నాపై పడిందా? అని మీరు అడిగితే.. అవుననే చెబుతా. నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిపై పడుతుంది. అంతపెద్ద టోర్నీలో సెమిస్ వరకు వెళ్లి విఫలమై రావడాన్ని అంత తేలికగా తీసుకోలేం. జయాపజయాలు అన్నింట్లోనూ ఉంటాయి. అది ఆటలోనైనా, జీవితంలోనైనా. అయితే నిజాన్ని అంగీకరించాల్సిందే. అదే నేను నేర్చుకున్నా.
తప్పు ఒప్పుకునేందుకు ధైర్యం కావాలి..
తప్పులను సరిచేసుకోవడానికి ఓటమనేది గొప్ప మార్గం. క్రికెట్ ఇందుకు మినహాయింపేమీ కాదు. జీవితమంటే తప్పులు సరిదిద్దుకోవడం. తప్పులు చేయడం సహజమే.. కానీ అది అంగీకరించే ధైర్యం, స్పష్టత ఉండాలి. నేను కూడా తప్పు చేశా. ఇది ఒప్పుకున్నందుకు నేను సిగ్గుపడట్లేదు. దాన్ని పునరావృతం కాకుండా ముందుకు వెళ్లడమే మన పని.
నా ఈగో కూడా ఊహించలేకపోయింది..
న్యూజిలాండ్‌తో సెమిస్ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔటయ్యా. మైదానంలో అడుగుపెట్టే ముందు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఇన్నింగ్స్ చివరి వరకు నాటౌట్‌గా ఉండాలి, లక్ష్యాన్ని ఛేదించి దిగ్విజయంగా ముగించాలని గట్టిగా అనుకున్నా. అయితే వెంటనే ఔటై వచ్చేటప్పుడు.. ఇదొక గేమ్ మాత్రమే అని మనసు చెబుతున్నా.. అంగీకరించలేకపోయా. నా ఈగో కూడా దీన్ని ఊహించలేకపోయింది.
అనుకున్నది జరగకపోతే ఎంతో బాధ..
మనం ఏమైన కావలనుకున్నా, దేన్నైనా బలంగా కోరుకున్నా కొన్ని సార్లు జరగకపోవచ్చు. అలాంటప్పుడు ఏలాంటి బాధైతే ఉంటుందో.. సెమీస్‌లో నా ఔట్ కూడా అంతే మనస్తాపాన్ని కలిగించింది.
న్యూజీలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో విరాట్.. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అనంతరం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో కివీస్ పరాజయం చెందింది. ఇంగ్లీష్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఇదీ చదవండి: శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్