అంతర్జాతీయ క్రికెట్లో ఓ వెలుగు వెలిగి.. 300 పైచిలుకు వికెట్లు తీసి అనంతరం జట్టులో చోటు కోల్పోయిన ఇర్ఫాన్ పఠాన్.. శనివారం వీడ్కోలు ప్రకటించాడు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చి ఇర్ఫాన్ కెరీర్ ముగిసిపోవడానికి అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ కారణమని అందరూ అనుకుంటారు. ఈ విషయంపై స్పందించాడు ఇర్ఫాన్ పఠాన్.
"నా కెరీర్ ముగిసిపోవడానికి కారణం అందరూ గ్రెగ్ చాపెల్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయలేరు. మీరు చేసే పనికి మీరే ప్రతిఫలం అనుభవిస్తారు. ఇది కూడా అంతే. గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోయా. అనంతరం తిరిగి పుంజుకొని పునరాగమనం చేయడం కొంచెం కష్టమైంది. ఈ అంశంపై ఎవరిని నిందించను" - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పు చాపెల్ ఒక్కడి ఐడియానే కాదని ఇర్ఫాన్ తెలిపాడు.
"టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయాలనేది చాపెల్ ఒక్కడి ఐడియా మాత్రమే కాదు. నేను ముందు బ్యాటింగ్ చేయాలని సచిన్ భావించాడు. చాలామంది నేను అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా బ్యాటింగ్ ప్రారంభించానని పొరబడుతుంటారు. నిజానికి నేను ఎప్పటినుంచో ఆడుతున్నా. బరోడా అండర్-16 జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశా. రంజీ ట్రోఫీలోనూ టాపార్డర్‌లో వచ్చా." - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
ఇర్ఫాన్ పఠాన్.. ఎక్కువ మ్యాచ్‌లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఆడాడు. అయితే తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరో చెప్పాడీ ఆల్‌రౌండర్.
"ఎవరు ఉత్తమ సారథి అని పోల్చడం సరికాదు. గంగూలీ కెప్టెన్ అయినపుడు భారత క్రికెట్ కఠిన పరిస్థితుల్లో ఉంది. అలాంటి సమయంలో అత్యుత్తమ విజయాలు అందించాడు దాదా. నాకు వ్యక్తిగతంగా రాహుల్ ద్రవిడ్ సారథ్యం నచ్చుతుంది. జూనియర్, సీనియర్లను ద్రవిడ్ బాగా మేనేజ్ చేశాడు. యువకులకు అవకాశమిచ్చాడు. అతడు నాకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అతడి సారథ్యంలోనే టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశా." - ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ క్రికెటర్.
శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్.. కెరీర్లో 29 టెస్టులు(1105 పరుగులు, 100 వికెట్లు), 120 వన్డేలు(1544 పరుగులు, 173 వికెట్లు), 24 టీ20ల్లో (172 పరుగులు, 28 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చదవండి: ఆసీస్ క్రికెటర్ స్టోయినిస్‌కు భారీ జరిమానా