ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 19న కోల్‌కతాలో జరగనుంది. మొత్తం 332 మందితో తుది జాబితా సిద్ధమైంది. సంబంధిత జాబితాలను బీసీసీఐ.. అన్ని ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వారిలో ఒకడు 14 ఏళ్ల నూర్ అహ్మద్.. మరొకరు 48 ఏళ్ల ప్రవీణ్ తాంబే. వీరిద్దరూ వేలంలో పాల్గొంటున్న చిన్నోడు-పెద్దోడుగా పేరు తెచ్చుకోనున్నారు.
15 ఏళ్లు ఇంకా నిండలేదు!
అఫ్గానిస్థాన్‌కు చెందిన నూర్ అహ్మద్... 14 ఏళ్ల 344 రోజుల వయసులోనే, వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం వేలంలో పోటీ పడుతున్నాడు. అతడి కనీస ధర రూ.20 లక్షలు. ఇటీవల భారత్ అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో అఫ్గాన్ 2-3 తేడాతో ఓడిపోయినా, నూర్ ప్రదర్శనతో మెప్పించాడు.
లెఫ్టార్మ్ చైనామన్ బౌలరైన నూర్.. ఈ సిరీస్‌లో తొమ్మిది వికెట్లతో సత్తాచాటాడు. అంతేకాకుండా దేశవాళీలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముందుగా ప్రాంఛైజీలు నిర్వహించే ట్రయల్స్‌లో భాగంగా ఇటీవలే రాజస్థాన్ రాయల్స్.. ఇతడిని పిలిచినట్లు సమాచారం.
అఫ్గాన్ నుంచి నూర్ అహ్మద్‌తో పాటు ఏడుగురు.. ఐపీఎల్ వేలంలో ఉన్నారు. వారిలో మహ్మద్ షెజాద్, జహీర్ ఖాన్, కరీమ్ జనత్, వకార్ సలామ్ ఖెయిల్, ఖాయిస్ అహ్మద్, నవీనుల్ హక్ ఉన్నారు. గతంలో ఇదే దేశానికి చెందిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబర్ రెహ్మాన్ లాంటి క్రికెటర్లు ఐపీఎల్‌లో సత్తాచాటారు.
తాంబే సీనియర్...
48 ఏళ్ల ప్రవీణ్ తాంబే.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం జరిగే వేలంలో పాల్గొంటున్న పెద్ద వయసున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో 2013 ఐపీఎల్‌లో ఆడిన ఈ క్రికెటర్... రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. కొంతకాలం మళ్లీ ఆటకు దూరమైన ఇతడు.. 2017లో సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆ సీజన్లో తుది జట్టులో ఆడలేదు. గతేడాది జరిగిన టీ10 లీగ్‌లో ఐదు వికెట్లు తీసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఇందులో మోర్గాన్, పోలార్డ్, ఫాబియో అలెన్, క్రిస్ గేల్, ఉపుల్ తరంగ వంటి ఆటగాళ్లను ఔట్ చేశాడు. 45 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని ఐపీఎల్ చరిత్రలో సీనియర్ క్రికెటర్‌గా బ్రాడ్ హగ్‌తో కలిసి పేరు తెచ్చుకున్నాడు.
వేలానికి అర్హత సాధించిన 332 మంది ఆటగాళ్లలో 186 మంది భారత క్రికెటర్లు, 143 మంది విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో నుంచి 73 మందిని మాత్రమే ప్రాంఛైజీలు ఎంచుకోనున్నాయి.