ప్రపంచకప్ సమరంలో టీమిండియా తొలిసారి ఆడబోతోంది... అదేంటి ఇప్పటివరకు 12 మెగాటోర్నీలు జరిగితే అన్నింట్లోనూ భారత్ ఆడింది కదా అనుకుంటున్నారా! అయితే ఇది 50 ఏళ్లకు పైబడిన క్రికెటర్లతో జరగబోయే టోర్నీ. వచ్చే ఏడాది నిర్వహించనున్న ఈ వరల్డ్‌కప్‌లో భారత్ తొలిసారి తలపడనుంది.
వచ్చే ఏడాది మార్చి 10 నుంచి 24 వరకు జరగనున్న ఈ ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. భారత్ తన తొలి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ టోర్నీ కూడా 50 ఓవర్ల ఫార్మాట్లోనే జరగనుంది.
టీమిండియా పూల్-బిలో చోటు దక్కించుకుంది. ఇందులో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, వేల్స్ జట్లు.. పూల్-ఏలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు ఇతర జట్లు ఉన్నాయి.
స్పోర్ట్స్, ప్రముఖ బ్లాండ్ నిపుణుడు శైలేంద్ర సింగ్.. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ శుభాకాంక్షలు చెప్పాడు.
"ఇదో అద్భుతమైన సందర్భం. జట్టు మొత్తానికి నా తరఫున గుడ్‌లక్ చెప్పాలనుకుంటున్నా. బాగా ఆడండి.. మీతో మేమున్నాం. ఆటను బాగా ఎంజాయ్ చేయండి" -కపిల్‌దేవ్, టీమిండియా మాజీ క్రికెటర్.
ఈ వయోధిక ప్రపంచకప్‌ను గతేడాది సిడ్నీ వేదికగా తొలిసారిగా నిర్వహించారు. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ఇదీ చదవండి: టీ20ల్లో రికార్డు.. పరుగులేమి ఇవ్వకుండా 6 వికెట్లు