భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు సౌరభ్ గంగూలీ. ముంబయిలో జరిగిన బోర్డు వార్షిక సాధారణ సమావేశంలో దాదా పగ్గాలు అందుకున్నాడు. గంగూలీ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పది నెలలపాటు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు.
సౌరభ్ ఈ పదవి స్వీకరించడం వల్ల 33 నెలలుగా బీసీసీఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీవోఏ) హయాం ముగిసిపోనుంది.
దాదాతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్‌కు చెందిన మహిం వర్మ, కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ దుమాల్, సంయుక్త కార్యదర్శిగా కేరళకు చెందిన జయేష్ జార్జి బాధ్యతలు స్వీకరించారు.
రెండో వ్యక్తిగా...
బీసీసీఐ అత్యున్నత పదవి అధిరోహించిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు దాదా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన మాజీ ఆటగాడు పూసపాటి ఆనంద గజపతిరాజు (విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా(1954-56) బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన తర్వాత సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ ఈ పదవిలో సేవలందించారు. అయితే వారు పూర్తి కాలం బాధ్యతలు నిర్వర్తించలేదు. 2014లో మధ్యంతర కాలానికి పనిచేశారు. కానీ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తి కాలానికి బాధ్యతలు చేపట్టాడు.
ఇదీ చదవండి: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలేంటో తెలుసా..!