వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కేమరూన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో. తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం అతడేనని, చాలా మంది కెరీర్లను నాశనం చేశాడని మండిపడ్డాడు. కేమరూన్ పదవి కాలం ముగియడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశాడు.
"కొంత మంది ప్రతీకార చర్యల వల్లే వెస్టిండీస్ క్రికెట్ కష్టాల్లో పడింది. అలాంటి వారి వల్ల చాలా మంది ఆటకు గుడ్‌బై చెప్పారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఉన్నాడు. నియంత పాలన అంతమైంది. పీడ విరగడైంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రికీ స్కిరిట్ట్తోనైనా విండీస్ క్రికెట్ మారుతుందని ఆశిస్తున్నా" - డ్వేన్ బ్రేవో, విండీస్ మాజీ క్రికెటర్.
2014 భారత పర్యటనలో విండీస్ కెప్టెన్‌గా ఉన్న బ్రావో.. ఆ దేశ బోర్డుకు ఎదురుతిరిగాడు. జీతభత్యాల విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శించడం వల్ల అప్పటికప్పుడే భారత పర్యటనను రద్దు చేసుకొని స్వదేశం వెళ్లిపోయాడు. ఈ కారణంగా ఐదు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ రద్దయింది.
2018లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్‌బై పలికాడు బ్రావో. విండీస్ తరఫున 40 టెస్టుల్లో 2,200 పరుగులతో పాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు.. 199 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 66 టీ20ల్లో 1,142 పరుగులు.. 52 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: 'రాత్రివేళల్లో గులాబి బంతితో కొంచెం కష్టమే'