2019లో టెస్టుల్లో ఎదురులేని జట్టుగా దూసుకెళ్లిన కోహ్లీ సేన... టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2020లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లను అడనుంది. న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లు సహా భారత క్రికెట్లో గంగూలీ, ద్రవిడ్ పాత్రలపై మాట్లాడాడు టీమిండియా టెస్టు జట్టు ఉప సారథి అజింక్య రహానే.
చల్లని గాలులే కీలకం...
న్యూజిలాండ్‌లో చల్లని గాలులకు తట్టుకోవడమే కీలకమని అజింక్య రహానె అన్నాడు. సాంకేతికంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరమేమీ ఉండదన్నాడు.

"2014లో మేం న్యూజిలాండ్‌లో పర్యటించాం. చల్లగాలి సమస్య ఎదుర్కొన్నాం. పరిస్థితులకు అలవాటు పడటమే కీలకం. చల్లదనంతో బంతులు రెండు వైపులా స్వింగవుతాయి. చివరి పర్యటనలో నేను వెల్లింగ్టన్‌లో ఆడాను. క్రైస్ట్‌చర్చ్‌లో ఆడలేదు. చాన్నాళ్ల తర్వాత అక్కడ ఆడబోతున్నాం. కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ ఈ మధ్య కాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతనొక్కడే కాదు ఒక బ్యాటింగ్ విభాగంగా మేం బౌలర్లు అందరినీ గౌరవించాలి. సొంతగడ్డపై ఆడుతుండటం వారికి ప్రయోజనకరం. అయితే మేం మా సహజమైన శైలిలో ఆడాల్సి ఉంటుంది".
-- రహానే, భారత జట్టు క్రికెటర్.
వాళ్లే కీలకం...
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఎన్సీఏ ఛైర్మన్ రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు రహానే.

" 2014లో మాకంత అనుభవం లేదు. ఇంగ్లాండ్‌తో ఘోర పరాజయం తర్వాత మేమంతా మాట్లాడుకున్నాం. అగ్రస్థానానికి చేరుకోవాలని పట్టుదలతో కృషి చేశాం. కోహ్లీ, రవి భాయ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కలివిడితనం పెంచారు. ఆటగాళ్లందరం ప్రేమతో ముందుకు సాగుతాం. ప్రసుత్తం దాదా, ద్రవిడ్ వల్లే భారత జట్టు స్థాయి అత్యున్నత దశకు చేరుతోంది".
-- రహానే, భారత జట్టు సారథి.
జనవరి 24 నుంచి మార్చి 4 మధ్యలో న్యూజిలాండ్ గడ్డపై ఆ జట్టుతో... 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది టీమిండియా.