మానసిక ఒత్తిడితో ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ బాటలోనే వెళ్తున్నాడు. భారత ఫస్ట్‌క్లాస్ ఆటగాడు ఆర్యమాన్ బిర్లా క్రికెట్‌కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా తెలిపాడు.
"అంకిత భావం, కఠోర శ్రమ, ధైర్యంతో క్రికెట్లో నా ప్రయాణం ఇప్పటివరకు సాగింది. అయితే కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నా. నేను బంధీగా మారానని అనిపిస్తోంది. నాకు నేనే ఒత్తిడిలోకి వెళ్లిపోయా. ప్రస్తుతం నా మానసిక స్థితి మెరుగు పర్చుకోవాలనుకుంటున్నా. కాబట్టి క్రికెట్‌కు విరామం తీసుకోవాలని నిర్ణయించా. ఇది ఎన్ని రోజులో చెప్పలేను. ఈ ఫేజ్ నాకు కష్టంగా ఉంది. ఈ నిర్ణయం వల్ల నా నిజమైన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరనేది తెలుస్తుంది. ఈ స్థితి నుంచి బయటపడి ఇంతకుముందు కంటే శక్తిమంతంగా తయారవుతానని అనుకుంటున్నా" - ఆర్యమాన్ బిర్లా, యువ క్రికెటర్.
ఆర్యమాన్ ప్రముఖ వ్యాపారవేత్త కుమారమంగళం బిర్లా తనయుడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది రాజస్థాన్ అతడిని వదులుకుంది. అయితే గురువారం జరిగిన వేలంలో ఆర్యమాన్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.
ఇప్పటివరకు 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు ఆర్యమాన్. ఇందులో ఓ శతకం(103) కూడా ఉంది. మధ్యప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇతడు 2017లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్ ఒడిషాతో ఆడాడు.
ఇదీ చదవండి: వావ్.. అనిపిస్తున్న ఒలింపిక్ మైదానం