కథానాయికల పాత్ర సినిమాల్లో కాస్తో కూస్తో మార్పు కనిపిస్తోంది. వాళ్లని కేవలం గ్లామర్‌కే పరిమితంగా చూడడం లేదు. వాళ్లకంటూ కథలో కొంత ప్రాధాన్యం దక్కుతోంది. అలా ఉంటేనే నాయికలూ ఒప్పుకుంటున్నారు. ఇది నిజంగా మంచి పరిణామమే. 'మజిలి', 'డియర్ కామ్రేడ్', 'ఓ బేబీ', 'సైరా'... ఇలా కథానాయిక పాత్రల్ని సరిగా డిజైన్ చేసుకున్న సినిమాలెన్నో కనిపిస్తాయి. వాటిలో పేరున్న కథానాయికలు నటించడం వల్ల ఆయా పాత్రలకు మరింత వన్నె వచ్చింది. సినిమాల సంఖ్య ఎక్కువ అవ్వడం, కథానాయకులు కూడా పెరగడం వల్ల హీరోయిన్ల డిమాండ్ మరింత ఎక్కువ అవుతోంది. దాంతో కొత్తతరం అమ్మాయిలకూ విరివిగా అవకాశాలొస్తున్నాయి.
బేబీ టూ జానూ
సమంత హవా 2018లో బాగా కనిపించింది. 'రంగస్థలం', 'యూటర్న్' వంటి విజయాలతో దూసుకుపోయింది. ఈ ఏడాది కూడా తనకు బాగా కలిసొచ్చింది. తమిళంలో నటించిన 'సూపర్ డీలక్స్' సమంతకు విమర్శకుల ప్రశంసల్ని తీసుకొచ్చింది. 'మజిలి', 'ఓ బేబీ' సినిమాలు నటిగా మరో నాలుగు మెట్లు ఎక్కించాయి. 'మజిలి'లో ఓ సగటు గృహిణిగా కనిపించిన సామ్.. 'ఓ బేబీ'లో విభిన్న పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఈ రెండు పాత్రలూ కొత్త సమంతని ఆవిష్కరించేలా చేశాయి. ఇక 'మన్మథుడు 2'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం '96' రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తోంది. 2020లోనూ తన కెరీర్‌ని సరిగానే ప్లాన్ చేసుకుంటోంది సమంత.
మిల్కీ బ్యూటీ హవా
2019లో బిజీగా ఉన్న మరో కథానాయిక తమన్నా. ఈ ఏడాది సంక్రాంతి సందడంతా తమన్నాదే. 'ఎఫ్ 2' విజయంతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాయికా ప్రాధాన్యం ఉన్న 'అభినేత్రి 2'లో నటించి అందరినీ మెప్పించింది. ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. 'పెట్రొమాక్స్' అనే తమిళ సినిమా చేసింది. 'సైరా'లో కీలక పాత్ర పోషించింది. 2020 సంక్రాంతి సీజన్‌లోనూ 'సరిలేరు నీకెవ్వరు'లో ప్రత్యేక గీతంలో కనిపించనుంది. 'దటీజ్ మహాలక్ష్మి'తో పాటు ఓ హిందీ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
అందాల తార కాజల్
కాజల్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. 'సీత', 'రణరంగం' చిత్రాలు కాజల్ ఆశించిన ఫలితాల్ని తీసుకురాలేకపోయాయి. అయితే తనకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. కమల్‌హాసన్ 'భారతీయుడు 2'లో కాజల్ ఎంపికైంది. 'బయి సాగా' అనే ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. మంచు విష్ణు సరసన నటిస్తున్న 'మోసగాళ్లు' ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.
నిశ్సబ్దంగా ఉన్న స్వీటీ
దక్షిణాదిన అగ్ర తారగా కొనసాగుతున్న అనుష్క ఈ ఏడాది మరీ నల్లపూసైపోయింది. తన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 'సైరా నరసింహారెడ్డి'లో మాత్రం అతిథి పాత్రలో కనిపించింది. తన కొత్త సినిమా 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస పరాజయాలతో రకుల్
రకుల్‌ప్రీత్ సింగ్‌కి కూడా ఈ ఏడాది కలసి రాలేదనే చెప్పాలి. చెప్పుకోదగిన సంఖ్యలో సినిమాలు చేసినా, సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. 'దేవ్', 'ఎన్‌జీకే', 'మన్మథుడు 2' మూడూ బాక్సాఫీసు వద్ద నిరాశ మగిల్చాయి. బాలీవుడ్‌లో చేసిన 'దే దే ప్యార్ దే' మాత్రం విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తనకు బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే రకుల్ మళ్లీ రేసులోకి రావొచ్చు.
2020కి సిద్ధమౌతున్న కీర్తి
2018లో 'మహానటి' తో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి గానూ ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. 2019 అంతా షూటింగులతో బిజీగా సాగింది. అయితే తన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖీ' చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఇవి రెండూ 2020లోనే వస్తాయి. తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. కీర్తి కోసం మరిన్ని కథలు సిద్ధం అవుతున్నాయి. 2020లో కీర్తి మరోసారి విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది.
కొత్త ఏడాదిలో పూజా హవా
2018లో 'అరవింద సమేత'తో విజయాన్ని అందుకుంది పూజా హెగ్డే. ఈ ఏడాది కూడా తనకు బాగానే కలిసొచ్చింది. 'మహర్షి' రూపంలో మరో హిట్టు తన ఖాతాలో చేరింది. 'గద్దలకొండ గణేష్'లో శ్రీదేవిగా మెప్పించింది. 'హౌస్‌ఫుల్ 4'తో బాలీవుడ్‌కీ వెళ్లొచ్చింది. ఈ సంక్రాంతికి తన సినిమా 'అల వైకుంఠపురములో' విడుదల కానుంది. ప్రభాస్ కొత్త చిత్రంలోనూ తనే కథానాయిక. కొత్త ఏడాదిలోనూ పూజ తన హవా చూపించబోతోందని తెలుస్తోంది.
బిజీ షెడ్యూల్‌తో రష్మిక
ప్రస్తుతం చిత్రసీమలో అత్యంత బిజీగా ఉన్న కథానాయిక రష్మిక. 'గీత గోవిందం'తో తన కెరీర్ వేగం పుంజుకుంది. మహేష్, అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల్ని అందుకుంది. అయితే 2019 పోగ్రెస్ కార్డు మాత్రం అంత గొప్పగా లేదు. 'డియర్ కామ్రేడ్' సరిగా ఆడలేదు. అది మినహా ఆమె నటించిన మరో తెలుగు చిత్రం ఈ ఏడాది విడుదల కాలేదు. మహేష్‌తో కలసి నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి వస్తోంది. నితిన్‌తో కలిసి నటిస్తున్న 'భీష్మ' సెట్స్‌పై ఉంది. అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ మూడు చిత్రాల్లోనూ రష్మిక పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉందట. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా.. మరో అరడజను అవకాశాల్ని తన అందుకోవడం ఖాయం.
డిసెంబరులో వరుస సినిమాలతో రాశీఖన్నా
ఈ ఏడాది రాశీఖన్నా నుంచి ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈ డిసెంబరులో తన ప్రతాపం చూపించబోతోంది. 'వెంకీ మామ', 'ప్రతి రోజూ పండగే' వారం రోజుల వ్యవధిలో విడుదలవుతున్నాయి. 'వరల్డ్ ఫేమస్ లవర్'లోనూ కథానాయికగా నటిస్తోంది. వీటితో పాటు ఓ తమిళ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.