నిఖిల్-లావణ్య త్రిపాఠి జంటగా టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ సురవరం'. తాజాగా ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. 'అర్జున్ సురవరం' అనేది ఓ సినిమా కాదని, మీడియా శక్తి ఏంటో అందరికీ అర్థమయ్యేలా చూపించిన చిత్రమని హీరో నిఖిల్ ఈ సందర్భంగా తెలిపాడు.
"సినిమా చూసిన ప్రతిఒక్కరూ గౌరవప్రదమైన సినిమా చేశావంటూ ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. ఫలితం పట్ల పంపిణీదారులు సంతోషంగా ఉన్నారు. 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' నా కెరీర్‌లో చాలా పెద్ద హిట్. దాని తర్వాత నేను చేసిన చిత్రాలు బాగానే ఆడినప్పటికీ నాలో అంత సంతోషాన్ని నింపలేదు. కానీ, ఈ చిత్రంతో తిరిగి నా ముఖంలోకి నవ్వులు వచ్చాయి. మా కష్టానికి, ఏడాదిన్నర ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కింది. ఈ విషయంలో చిరంజీవికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అనేక అవాంతరాలు దాటుకొని వచ్చిన మా చిత్రాన్ని ఆయనే పైకెత్తారు. ఈ విజయం దర్శకుడికే సొంతం. నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వాళ్లు ఈ చిత్రానికి కొనసాగింపు చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు."
నిఖిల్, సినిమా హీరో
సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దర్శకుడు టి. సంతోష్ మూవీలో నటించిన ముఖ్య పాత్రల గురించి మాట్లాడాడు.
"నిఖిల్ మంచి నటుడని అందరికీ తెలుసు. ఇందులో మరింత పరిణతితో కూడిన నటించాడు. ప్రతి సన్నివేశాన్ని తన నటనతో హైలైట్ చేశాడు. నాగినీడు పాత్ర సినిమాకు వెన్నెముకలా నిలిచింది. ఇంత చక్కటి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు."
టి.సంతోష్, సినిమా దర్శకుడు
సినిమా ఆలస్యంగా వచ్చినా మంచి సక్సెస్ దక్కిందని, ఇంతటి భారీ విజయం సాధిస్తుందని ఊహించలేదంటూ తెలిపంది లావణ్య. దర్శకుడితో పాటు నటీనటులంతా కష్టపడి సినిమాకు పనిచేశారని పేర్కొంది. ఇలాంటి అవకాశమిచ్చినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిందీ ముద్దుగుమ్మ.