బాలీవుడ్ భామ, 'ఆర్ఆర్ఆర్' ముద్దుగుమ్మ ఆలియా భట్ ఇటీవల ఓ ఈవెంట్లో కంటతడి పెట్టించే విషయాన్ని పంచుకుంది. ఒకానొక దశలో తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక వేదికపైనే వెక్కివెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ భామ ఇలా కన్నీటి పర్యంతమవ్వడానికి కారణమేంటో తెలుసా..?
ఆలియా బాధకు తన సోదరి ఆరోగ్య పరిస్థితే కారణమట. కొన్నేళ్ల క్రితం ఆలియా సోదరి షహీన్ తీవ్ర ఒత్తిడి(డిప్రెషన్)తో బాధపడిందట. సుదీర్ఘ చికిత్స తీసుకున్న తర్వాత తను కోలుకుంది. ఆ సమయంలో తన అనుభవాలు, భావోద్వేగాలను వివరిస్తూ 'ఐ హావ్ నెవర్ బీన్ అన్హ్యాపీయర్' పేరుతో పుస్తకాన్ని రచించింది షహీన్. తాజాగా ఆలియా చేతుల మీదుగా ముంబయిలో పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తన సోదరి ఒత్తిడితో ఎలా నరకం అనుభవించిందో తెలిపిందీ ముద్దుగుమ్మ.
![Alia Bhatt cries inconsolably as sister Shaheen Bhatt opens up on having suicidal thoughts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5241733_991_5241733_1575274456524.png)
"నేనెప్పుడూ ఒత్తిడితో బాధపడలేదు. కానీ, ఏదో తెలియని ఆత్రుతకు గురయ్యేదాన్ని. అయితే అక్క పరిస్థితి చూసి కొన్నాళ్లుగా నేనెంతో బాధపడ్డా. ఎట్టకేలకు తను ఆ ఒత్తిడిని జయించి మామూలు మనిషి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తను రాసిన ఈ పుస్తకం చదివాకే ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది."
-ఆలియా భట్, సినీ నటి
ఇలా చెప్తున్న సమయంలో తీవ్ర ఉద్వేగానికి గురైన ఆలియా వేదికపై చిన్నపిల్లలా కన్నీరుపెట్టుకుంది. పక్కనే ఉన్న తన సోదరి షహీన్.. ఆలియాను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు ఆమె అలాగే ఏడుస్తూ ఉండిపోయింది.
ఇవీ చూడండి.. సినీ వినీలాకాశంలో సిల్క్ స్మిత మరపురాని జ్ఞాపకం