తెలంగాణలోని హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో.. ఓ ఇంట తీరని విషాదం జరిగింది. చింతల్‌మెట్ ఎమ్‌ఎమ్ పహాడీలో మహమ్మద్ మస్తాన్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, పదకొండేళ్ల మెన్హాజ్ బేగం, తొమ్మిది సంవత్సరాల నైనా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివారు.
ఇద్దరూ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వారిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితిలో మార్పులేని కారణంగా.. హఫీజ్‌పేటలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెన్హాజ్ బేగంను చేర్చుకున్న ఆసుపత్రి వర్గాలు... నైనాను నిలోఫర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు.
నైనా చికిత్స పొందుతున్న సమయంలోనే ఆరోగ్యం విషమించి ప్రాణం విడిచింది. ఇంతలోనే మెన్హాజ్ బేగం కూడా చనిపోయింది. ఇద్దరూ ఒకేసారి అస్వస్థతకు గురికావడం, ఒకే రోజు చనిపోవడంపై బాధిత కుటుంబంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారుల మృతికి కారణం ఏంటో తెలిసే అవకాశం ఉందన్నారు.
ఇవీ చూడండి: