ఎంతోమంది... ఆర్థిక, ఇతర వనరులు సమకూరిస్తే తప్ప వృద్ధాశ్రమాలు నడవని పరిస్థితి. విజయవాడ సమీపంలోని దండమూడి వీరరాఘవయ్య, సరోజినీ దేవీ వృద్ధాశ్రమం మాత్రం అన్నిటికంటే భిన్నంగా నడుస్తోంది... స్వక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది.
గోశాల వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో 31 మందికి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. 1993 నుంచి వాసవ్య మహిళామండలి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వృద్ధాశ్రమం... 2017 నుంచీ సేకరించిన చందాలు, వనరులతో వసతి కల్పిస్తోంది. ఉచితంగా భోజనం, వసతి కల్పించటమేగాక... ఆత్మరక్షణపై మహిళాశక్తి బృందాలతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఇటీవల సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్వహకులు ప్రణాళికలు రచించారు. భారత్‌లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ ఇచ్చిన రూ.6 లక్షల 35వేలతో... 10 కేవీ సామర్థ్యం కలిగిన సౌరవిద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని నుంచి నెలకు 1200 యూనిట్ల విద్యుత్ తయారవుతోంది. ఆశ్రమం అవసరాలకు 800 యూనిట్లు ఖర్చు కాగా... మిగిలిన 400 యూనిట్లను విద్యుత్‌శాఖకు అమ్ముతున్నారు.
దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గటమే కాకుండా... ఆదాయమూ వస్తోందని నిర్వహకులు చెబుతున్నారు. వృథా అరికట్టే మరిన్ని విధానాలు అమలుచేసి... ఆశ్రమం ఆదాయం పెంచుతూ... మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.