తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన... విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో తెదేపా రాష్ట్రస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 10 అంశాలపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. కిందటి ఎన్నికల ఫలితాలపైనా సమీక్షించనున్నారు. తెదేపా కార్యకర్తలు, ప్రజలపై దాడులు, ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ అంశాలపై చర్చిస్తారు. ఏపీ భూభాగంలోనే గోదావరి అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలనే డిమాండ్‌ను తెరమీదకు తేనున్నారు. స్తంభించిన అభివృద్ధి, రద్దుచేసిన సంక్షేమ పథకాలపట్ల పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోనున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు, లోక్‌సభ స్థానం యూనిట్‌గా కమిటీల ఏర్పాటుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాలను సమర్థంగా తిప్పికొట్టిన తీరుపై ప్రధానంగా చర్చిస్తారు.
నేతలతో టెలీకాన్ఫరెన్స్...
రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా తప్పుడు విధానాల వల్ల వివిధ వర్గాల వారు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వంలో చలనంలేదన్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ఓట్లు పెద్ద ఎత్తున తొలగించాలని తహసీల్దార్‌లకు లక్ష్యాలు నిర్దేశించారని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని గట్టిగా ప్రతిఘటించాలన్న చంద్రబాబు... ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేద్దామని చెప్పారు.
తెదేపా కార్యకర్తలపై దాడులు పెట్రేగిపోయాయన్న చంద్రబాబు... అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలపై ధ్వజమెత్తారు. కార్యకర్తలపై దాడులకు సంబంధించి సమగ్ర నివేదికతో సమావేశానికి రావాలని నేతలకు సూచించారు. గతంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా పనులు చేస్తే... వాటి బిల్లులు ఇవ్వొద్దని ఆదేశాలు ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రంలో ఇసుక ధర పెరగడం, అన్నా క్యాంటీన్ల మూసివేత వంటి అంశాలపై నేతలతో చర్చించారు. సమగ్ర వివరాలతో సమావేశానికి వస్తే... అందుకు తగ్గ పోరాట అజెండా సిద్ధం చేసుకుందామని నేతలకు వివరించారు.
2019-సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జరిగే రెండో సమావేశం కావడంతో... పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు నేతలకు వివరించనున్నారు. త్వరలో స్థానిక సంస్థలు, సహాకార, పురపాలక, నగరపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున... పార్టీ అభ్యర్ధులు గెలిపించేందుంకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగిస్తారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికలకు అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండీ...