రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి ప్రమాదకర ప్రాంతం వద్ద ఓ భద్రతా వాహనాన్ని 24 గంటలూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాంటి చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
1400 ప్రమాదకర ప్రాంతాలు గుర్తింపు
రాష్ట్రంలో ఏడాదికి సగటున 25 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో 7 నుంచి 8 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు శాఖ అధ్యయనంలో తేలింది. మొత్తం 14 వందల ప్రమాదకర ప్రాంతాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తే ప్రమాదాలతో పాటు... మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద గుర్తించిన ఇంజినీరింగ్ లోపాలను సరిచేయించడం సహా వెలుతురు తక్కువైన చోట లైట్లు ఏర్పాటు చేయించనున్నారు. సర్వీసు రహదారులు, గ్రామీణ రోడ్ల నుంచి ప్రధాన మార్గంపైకి వాహనాలు ఒకేసారి దూసుకొచ్చే పరిస్థితి ఉంటే... అలాంటి వాటిని నిలువరిస్తారు. స్పీడ్ గన్ల ద్వారా అతివేగంతో వెళ్తున్న వారిని గుర్తించి నిలువరించనున్నారు.
అందుబాటులో భద్రతా వాహనం
ప్రమాదాలు జరిగితే బాధితులను వెంటనే ఆస్పత్రికి చేర్చేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అందుకోసం రోడ్డు భద్రతా వాహనాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచనున్నారు. బాధితులను సమీపంలోని ట్రామా కేర్ సెంటర్లకు తరలించడం... ఆసుపత్రికి చేరే వరకు చికిత్స అందించే ఏర్పాట్లన్నీ ఈ వాహన సిబ్బందే చూస్తారు. ప్రతి ప్రమాదకర ప్రాంతం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో నిక్షిప్తమయ్యే దృశ్యాలను విశ్లేషించి, ఏయే కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తిస్తారు. ఆ మేరకు నివారణ ప్రణాళిక అమలు చేయనున్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు 108 సహా అన్ని అంబులెన్సులను పోలీసు శాఖతో సమీకృతం చేయాలని... డీజీపీ గౌతం సవాంగ్ ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: