ఖైదీల శ్రమకు ధర్మమైన వేతనం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ... న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. నైపుణ్యం లేని, సగం నైపుణ్యం ఉన్న, నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా విభజించి 30,50,70 చొప్పున చెల్లిస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు 1998లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖైదీలకు న్యాయబద్ధ వేతనం చెల్లించాల్సి ఉందన్నారు.
హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఖైదీలకు కనీస వేతనం చెల్లింపు వర్తించదన్నారు. 2009లో ప్రభుత్వం ఖైదీలకిచ్చే ప్రోత్సాహకాలను ఖరారు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకే చెల్లింపులు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కమిటీ పరిశీలనలో ఉందని చెప్పారు. ఆ వాదనలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు న్యాయబద్ధమైన వేతనం చెల్లించాలని చెబితే మీరు ప్రోత్సాహకాల గురించి చెబుతారేమిటని ప్రశ్నించింది. 2009లో ఇచ్చిన జీవో గురించి ఇప్పుడు చెబుతున్నారేమిటని నిలదీసింది. సుప్రీంకోర్టు తీర్పును ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని స్పష్టం చేసింది. 4 నెలల గడువు కోరగా... న్యాయస్థానం 2 నెలలు గడువిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
ఇదీచదవండి