ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం... ఉద్యోగాలు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలని.. ఆంగ్లం రాకపోతే వెనకబడే పరిస్థితి ఉందని అన్నారు. పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవకపోతే మన రాష్ట్రం నష్టపోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంగ్ల ల్యాబులు...
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 1 నుంచి 6 తరగతుల వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుందని...ఆ తర్వాత ఏటా 7, 8, 9, 10 తరగతులను కలుపుకుంటూ వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చదువు రానివారు 33 శాతం మంది ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్బంగా విద్యారంగంలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేశారు.