రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో... విజయవాడ కృష్ణా నదీతీరాన నిర్వహించిన మహా రుద్రాభిషేకం ఆద్యంతమూ భక్తిశ్రద్ధలతో సాగింది. నేతలు, అధికారులు, హింధూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సహా... భక్తులు పెద్దఎత్తున మహా శివుడి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... భక్తుల బృందం పూజాదికాల నిర్వహణ బాధ్యత చేపట్టింది.
మట్టితో చేసిన 8 అడుగుల శివలింగానికి... నాగ సాధువులు, వేద పండితులు అభిషేకం నిర్వహించారు. మహాదేవుడికి పూజలు చేస్తుంటే... భక్తులు ఆధ్మాత్మికానందంలో మునిగితేలారు. రుద్రునికి ప్రీతి పాత్రమైన పవిత్ర పుణ్యనదీ జలాలు... విశేష ద్రవ్యాలు, పుష్పాలు, మధుర ఫలరసాలతో శివలింగానికి అభిషేకం చేశారు. మృత్తికా శివలింగ రూపంలో కొలువుదీరిన రుద్రుడికి... శంఖు, ఢమరుక, ఘంటానాదాల కోలాహలం మధ్య మహా రుద్రాభిషేకం సాగింది.
తుది ఘట్టంలో చితిభస్మంతో మహా భస్మాభిషేకం నిర్వహించారు. భక్తులు మహా హారతిని తిలకించి... దేవదేవుడిని దర్శనం చేసుకున్నారు. పలువురు హిందూ మత పీఠాధిపతులు, ఆధ్మాత్మిక ప్రముఖులు ఆశీర్వాదాలు అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో... రాష్ట్రం సుభిక్షంగా ఆకాంక్షించారు. శివునికి అత్యంత ఇష్టమైన రోజున నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో... పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.