కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురుచేస్తోంది. 4 రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. పరీవాహక ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేశారు. అధికారుల హెచ్చరికలతో లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివస్తున్నారు. పెద్దఎత్తున పంటలు నీట మునగగా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న ఇళ్లల్లో వరద ముంపు మరింత పెరిగింది. కృష్ణా జిల్లాలోని మొత్తం18 నదీ పరివాహక మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. జగ్గయ్యపేట, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు మండలాలతోపాటు విజయవాడ నగరంలోనూ వరద ముంపు అధికంగా ఉంది.
పునరావాస కేంద్రాలకు మొత్తం 8వేల 100 మందిని తరలించారు. వారికి ఉచితంగా ఆహారం, వసతి, తాగునీటి సౌకర్యంతోపాటు వైద్య సేవలు అందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు చల్లపల్లి మండల పరిధిలో 20 హెక్టార్లలో పట్టుపరిశ్రమకు నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సంయుక్త కలెక్టర్ మాధవీలత, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్, సబ్ కలెక్టర్ మిషాసింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులతో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి సూచనలు చేస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా... వరదల పరిస్థిపై ఎప్పటికప్పుడూ ఆరాతీస్తున్నారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు.
నిత్యం పర్యాటకులు, భక్తులతో రద్దీగా ఉండే భవానీ ద్వీపం, పుష్కరఘాట్లు ప్రస్తుతం వరదలో చిక్కుకున్నాయి. పవిత్ర సంగమం నుంచి విజయవాడలోని పద్మావతి ఘాట్ వరకు అన్ని చోట్ల ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీపై ద్విచక్ర వాహనాలు మినహా... మరే ఇతర వాహనాల రాకపోకలు సాగించకుండా పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. బ్యారేజీ వద్ద జనం తాకిడి మరీ ఎక్కువగా ఉంటున్నందున... ద్విచక్ర వాహనాలనూ నిలిపివేయాలని పోలీసులు యోచిస్తున్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్వయంగా బ్యారేజీని సందర్శించి... అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున... పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారులు గ్రామాల్లో పహరా కాస్తున్నారు. 8లక్షల క్యూసెక్కులు వదిలినా... తీర గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో... భారీ వర్షాన్నీ లెక్కచేయకుండా వాగులు దాటుకుంటూ తీరప్రాంత ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు దగ్గరుండి పంపిస్తున్నారు. ఎస్సీ, బీసీల ఫీల్డ్ లేబర్ సొసైటీల్లో సాగవుతున్న పంటలు, కరకట్ట వెంబడి పొలాల్లో సాగవుతున్న పంటలు వరద ముంపులో చిక్కుకున్నాయి. అరటి, కంద, పసుపు, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెపుతున్నారు.
ఇదీ చదవండీ...