విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి విక్రయానికి రాజధాని ప్రాంతం వేదికగా మారుతోంది. విజయవాడ శివారు ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. కొంతమంది ముఠాగా ఏర్పడి... విశాఖ జిల్లా నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి నుంచి తీసుకొచ్చిన గంజాయిని విజయవాడ సహా జిల్లా అంతటా సరఫరా చేస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి ఈ సంస్కృతి క్రమంగా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
పెద్దగా జనసంచారం లేని ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన ఉండే హోటళ్లు, రైల్వేగేటు ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయిని విజయవాడ, మైలవరం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, కోదాడ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అమ్ముతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం వికృత వ్యాపార జోరుకు నిదర్శనం.
ఖరీదైన కొకైన్ సంస్కృతీ రాజధాని ప్రాంతానికి పాకింది. యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు కొనసాగుతున్నాయని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తపరిచారు. గంజాయి రవాణా పోలీసుల కంటపడకుండా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్సైజ్, పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సమన్వయంతో పనిచేసి... ఈ మత్తు మహమ్మారి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని... పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి