పాక్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. మత్స్యకారులతో సమావేశమైన సీఎం... పేరు పేరునా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వారిని ప్రశ్నించారు. పోర్టు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని మత్స్యకారులు తెలిపారు. తమకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే... ఇక్కడే తమ కుటుంబాలతో కలిసి ఉంటామని కోరారు. తమ ప్రాంతంలో సముద్ర తీరం ఉన్నా జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల ఏటా 10 నుంచి–15వేల మంది గుజరాత్‌కు వలస వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. 14 నెలలపాటు పాక్ జైల్లో తాము పడిన కష్టాలను సీఎంకు వివరించారు.
మత్స్యకారులు తెలిపిన సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారు. భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు కోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామన్న సీఎం... అందరికీ చెక్కులను అందించారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు. పాకిస్థాన్ జైల్లో మిగిలిన ఉన్న మరో ఇద్దరు మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. అలాగే బంగ్లాదేశ్ జైల్లో ఉన్న 8 మందిని విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తమను పాక్ జైలు నుంచి విడిపించడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. తాము పడిన కష్టాలను చెప్పుకున్నారు. తమ కుటుంబీకులను తిరిగి కలుసుకుంటామని అనుకోలేదన్నారు. 14నెలల జైలు జీవితం తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.