రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన కింద వస్తోన్న దరఖాస్తుల వివరాలను... సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో నమ్మకం పెరగడంతో దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. ఇచ్చిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదని... కలెక్టర్లు సీరియస్గా చూస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు కూడా స్పందనను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. "నా కలెక్టర్లు, ఎస్సీలు సమర్థులు" అని గట్టిగా నమ్ముతున్నాని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మండలాల్లో ఎక్కడా అవినీతి లేకుండా చూడటం ద్వారా ప్రజలు సంతృప్తికరంగా ఉండేలా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దు. అవినీతి చేస్తే సహించబోమని ప్రతి సమీక్షా సమావేశంలో చెప్పాలి. లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకంటామని హెచ్చరించాలి. -వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇసుక పంపిణీలో అవినీతికి తావివ్వొద్దు...
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యతపై సీఎం ఆరా తీశారు. సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయని, పారదర్శకమైన విధానం ఉంటుందన్నారు. ఇసుక పంపిణీలో అవినీతి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యతపైనా అధికారులతో చర్చించారు. మధ్యాహ్న భోజన పథకానికి కలెక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
సచివాలయాలకు భవనాలు గుర్తించండి...
గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపును తప్పనిసరిగా చేయాలన్న సీఎం జగన్... అన్ని వసతులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలని సూచించారు. కంప్యూటర్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని... స్కానర్, ప్రింటర్ ఉంచాలని ఆదేశించారు. దరఖాస్తు ఇచ్చిన 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఇచ్చేట్టు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్ నుంచే అడిగిన వారికి అడిగిన కార్డు ఇచ్చేట్టు ఉండాలని... అప్పుడే గ్రామ సచివాలయానికి ఒక అర్థం వస్తుందని చెప్పారు. ప్రజల హృదయాల్లో గ్రామ సచివాలయం చిరస్థాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు.