అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం అట్టడుగుకు వెళ్లిపోతోందని ప్రతిపక్షనేత చంద్రబాబు ధ్వజమొత్తారు. జగన్ 3 నెలల పాలనకే అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కిందటి ఎన్నికల్లో ప్రజలు తమ కష్టాన్ని గుర్తించలేదన్న బాధ ఉన్నప్పటికీ... జగన్ పాలనతో తామేంటో జనానికి తెలిసిందన్నారు.
రాష్ట్రంలో ఇసుకతుపాను...
రాష్ట్రంలో ఇసుక దొరక్క... 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తుచేశారు. అయినా ఈ ప్రభుత్వం చలించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ఇసుకను పక్కరాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రూ.3500 ఉండే లారీ ఇసుకను రూ.40వేలకు అమ్ముతున్నారన్నారు. ఇదంతా... "జగన్మాయ" అని ధ్వజమెత్తారు.
అమరావతిని దెబ్బతీశారు...
ప్రపంచం మెచ్చే రాజధానిని కట్టాలని కలలు కంటే... అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి తిరిగి పూర్వవైభవం తెచ్చేదిశగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు రాజధానిపై కమిటీ వేయడం కక్షసాధింపేనని ఆక్షేపించారు.
జగన్‌కు ఓనమాలు కూడా రావు...
ఇరిగేషన్లో జగన్‌కు ఓనమాలు కూడా రావని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో తాము చేపట్టిన నదుల అనుసంధానాన్ని విమర్శించిన జగన్... ఇప్పుడు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. బొల్లాపల్లి-భనకచర్ల ప్రాజెక్టు... తాము ప్రతిపాదించిన గోదావరి-పెన్నా అనుసంధానంలోనిదేనని పేర్కొన్నారు. కేసీఆర్తో కలసి చేపట్టిన ప్రాజెక్టుపై విమర్శలు రావడంతో ఇప్పుడు దారికి వచ్చారన్నారు.
వంశీని లొంగదీసుకునేందుకే కేసులు...
వల్లభనేని వంశీని లొంగదీసుకునేందుకే అతనిపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. వంశీకి అండగా ఉంటామని... న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. డీజీపీ వ్యవహారశైలిపైనా చంద్రబాబు ధ్వజమెత్తారు.
నన్నేం చేయలేరు..
తనను అవినీతి కేసుల్లో ఇరికించడానికి... 5 నెలలుగా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 26 ఎంక్వైరీలు వేసి... ఒక్కటి రుజువు చేయలేక పోయారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదన్న చంద్రబాబు... ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడతామని ధీమా వ్యక్తం చేశారు.