విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలల వేదికగా... 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భాషా ప్రేమికులు... తెలుగు భాషా వేత్తలతో సభాప్రాంగణాలన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాంటి వేదికలోనే మరో మహా సంకల్పానికి ఆస్కారమిస్తోంది పుస్తకప్రదర్శన శాల. దేశం నలుమూలల నుంచి తీసుకువచ్చిన ఎన్నో అద్భుతమైన పుస్తకాల సమ్మేళనంలో.... పఠనాసక్తి కలిగిన వారు తీరిక లేకుండా గడిపేస్తున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన వారంతా పుస్తకప్రదర్శనను తిలకించటంతో పాటు... తమకు నచ్చినవి కొనుగోలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పుస్తక పఠనానికి నేటి యువతరం దూరమవుతోందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క పుస్తకమైనా చదవించాలి
సాంకేతికతను సరైన పంథాలో వినియోగించుకోవటం మాత్రమే శ్రేయస్కరంగా పుస్తక ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. నిజమైన జ్ఞానం వృద్ధి చెందాలంటే మాత్రం... అది పుస్తక పఠనంతోనే సాధ్యమని ఘంటాపథంగా చెబుతున్నారు. పిల్లలను ఒక పుస్తకమైనా చదివించే బాధ్యతను తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరుతున్నారు.