ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గో అండ్ పార్సిల్ సర్వీసును ఆర్టీసీ అమలు చేస్తోంది. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు, తక్కువ సమయంలో పార్శిళ్లను చేరవేస్తూ అందరి ఆదరణ చూరగొంటోంది. దీంతో అనతికాలంలోనే ఆదాయం భారీగా పెరిగింది.
వస్తువులు భద్రం...
కాంట్రాక్టర్ల సేవా లోపాల వల్ల వినియోగదారులు ఇప్పటి వరకూ ఇబ్బందులు పడుతూ వచ్చారు. పార్శిళ్లు మాయం కావడం, సక్రమంగా... సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో అవాంతరాలు కలిగేవి. సాంకేతిక సమస్యల వల్ల వచ్చిన సమస్యల వల్ల గతేడాది ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటి పరిష్కారంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ యాజమాన్యం సాంకేతికతో పరిష్కారాన్ని సూచించింది. మరింత నాణ్యంగా వినియోగదారులకు అందించేందుకు పయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ కార్గో వ్యవస్థను ఆధునీకరించింది. సేవా లోపాలకు కారణమైన వారిని కాంట్రాక్టు నుంచి తప్పించిన ఆర్టీసీ... రీజినల్ వారీగా ఎక్కడిక్కడే టెండర్లను పిలిచి అప్పగించింది. పాటించాల్సిన విధానాలు, మార్గదర్శకాలను జారీ చేసి ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తోంది.
మూడోనేత్రం కనుసన్నల్లోనే...
పార్శిల్ కేంద్రాల్లో గతంలో సీసీ కెమెరాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని కేంద్రంలో గతంలో 16 సీసీ కెమెరాలు ఉండగా... వాటిని 28కి పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో బుకింగ్ కేంద్రం, డెలివరీ కేంద్రాలు సహా పార్శిళ్లను భద్రపరిచే గోడౌన్లను సీసీ కెమెరా నీడలోకి తెచ్చారు. పార్శిల్ ను బుక్ చేసిందుకు వచ్చే ప్రతి వినియోగదారుడికి సంబంధించి వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు కంప్యూటర్ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎక్కడుంది.. ఎప్పుడొస్తుంది!
వినియోగదారుడు ఫొటో తీసి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ పార్శిల్‌పై బార్ కోడింగ్‌ను అంటించి.. స్కాన్ చేస్తున్నారు. పార్శిల్ పై ఓ నెంబర్ రాసి అంటించే వ్యవస్థ గతంలో ఉండగా.. ఇప్పుడు బార్ కోడింగ్‌ను ప్రవేశపెట్టారు. దీని సహకారంతో పార్శిల్ ఎక్కడుంది. ఎవరికి సంబంధించింది.. ఎక్కడికి చేరాలనే వివరాలన్నీ ఒక్క క్షణంలో తెలుసుకుంటున్నారు. అది ఎప్పుడు గమ్య స్థానానికి చేరుతుందో... చెప్పేస్తున్నారు. డెలివరీ కేంద్రంలోనూ వేలాది పార్శిళ్ల మధ్య ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు.
ఇంటి వద్దకే సేవలు...
ఆర్టీసీ పార్శిల్ సర్వీసును విజయవాడలో అత్యధిక మంది వినియోగించుకుంటున్నారు. 20 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల ఎక్కడికైనా నేరుగా ఇంటికే తీసుకెళ్లి పార్శిల్ ను అందించే ఏర్పాటు చేస్తున్నారు. కార్గో సేవల్లో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వినియోగదారులు 0866-2973437 నెంబర్లో ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.
నష్టాల్లో నడుస్తున్న సంస్థను లాభాల్లో నడిపించేందుకు అధికారులు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. పది రోజుల్లో పార్శిల్ ఇంటికి చేరకపోతే... దాని బీమాను ఆర్టీసీనే నేరుగా అందించాలనుకోవడం అభినందనీయం. ఇకపై... ఆర్టీసీలో మన వస్తువులు సురక్షితం... భద్రం!
ఇదీ చదవండి: శింగనమలలో ధన పిశాచి.. ఆ మాంత్రికుడు ఏం చేశాడంటే!