కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం బాధిత గ్రామాల్లో పర్యావరణవేత్తల బృందం పర్యటించింది. విశ్రాంత పర్యావరణ శాస్త్రవేత్త బాబూరావు, జనసేన నేత సత్యనారాయణ, మానవహక్కుల వేదిక సభ్యురాలు జయశ్రీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రతినిధి రమణధార పర్యటించారు. బాధితుల సమస్యలను ఆరా తీశారు. వారికి వచ్చిన వ్యాధులు, వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో చాలాసార్లు పర్యటించి, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడిన కె.బాబూరావు... ఇక్కడి మట్టి, నీటిని పరీక్షించి కాలుష్యం ఉందని నివేదించారు. మరోసారి బృంద సభ్యులతో కలసి కేకే కొట్టాల, కనంపల్లి, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారిపల్లె గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పిల్లల నుంచి పెద్దవరకు అందరికీ చర్మవ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు. బాధిత గ్రామాల్లో తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని బృంద సభ్యులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
వివిధ రకాల చర్మవ్యాధులు సహా థైరాయిడ్, కిడ్నీ, గర్భస్రావాలు సంభవిస్తున్నాయని... యురేనియం బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఏదో చేస్తామంటూ చాలామంది ఈ ప్రాంతానికి వస్తున్నా... సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. యురేనియం అనర్థాలతో ఏళ్లుగా అల్లాడిపోతున్న తమ్మలపల్లె ప్రాజెక్టు బాధిత ప్రజలు... ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి:"నివేదిక వచ్చాక... పోలవరంలో ఎంత మిగిలిందో చెప్తాం"