భారతదేశం వైద్య సేవల్లో ఎంత ముందడుగు వేసినా... 85 శాతం వైద్య పరికరాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడే వైద్యపరికరాల తయారీ, శిక్షణ ఉంటే.. వైద్యం ఖర్చు తగ్గుతుందన్నది నిపుణుల మాట. ఈ దిశగా నాగార్జున విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. నాగార్జున వర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ విభాగం, కాకినాడకు చెందిన హెల్దీ వరల్డ్ ఆర్గనైజేషన్... ఇండో-స్విస్ భాగస్వామ్యంతో మెడ్ టెకాహోలిక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్సుతో కూడిన అధునాతన వైద్యపరికరాల సాయంతో అన్నిరకాల వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలను నిమిషాల్లో నిర్వహిస్తారు. ఇప్పటికే పలు అధునాతన వైద్య పరికరాలను ఇక్కడకు తీసుకు వచ్చారు.
వివిధ వ్యాధుల పరీక్షల కోసం 15 వరకూ అధునాతన పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. 1100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ కిట్లు అందిస్తారు. నామమాత్రపు రుసుముతో రోగులకు అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. సెల్‌ఫోన్ అనుసంధానంతో తక్షణ వైద్యసాయంపై వైద్యుల సూచనలు, సలహాలు పొందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్యాంధ్రగా రాష్ట్రం రూపుదాల్చేందుకు మరిన్ని అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి రావాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి
'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా.. రాజధానిని మార్చడమేంటి'