పల్నాడును మరో పులివెందుల పంచాయితీ చేస్తామంటే సహించబోమని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్న చంద్రబాబు... బాధితులను వెంటతీసుకుని తానే ఊరులోకి వెళ్తానని చెప్పారు. ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు. తమ పార్టీ తిరుగుబాటు చేస్తే జైళ్లు సరిపోవని హెచ్చరించారు.
తాడోపేడో తేల్చుకుంటాం...
బాధితుల ఊళ్లలో తానే ఉంటానని... తాడోపేడో తేల్చుకుంటామని ఆగ్రహంగా మాట్లాడారు. పోలీసులు శిబిరానికి వచ్చి మాట్లాడి బాధితులను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తే జైళ్లలో ఉంటాం కానీ... పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించకుంటే పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తూ ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. వైఎస్ కంటే దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పోలీసులు తమ వృత్తికి న్యాయం చేయాలని హితవు పలికారు.
తెదేపాకు ఓటు వేశారని ఊళ్లు ఖాళీ చేయమంటారా...
గ్రామాల్లో మళ్లీ సాధారణస్థితి వచ్చేవరకు పోరాడతామని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం నేతలపై ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా నేతలపై కుట్రతోనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు... అనంతపురంలో నిర్మాణ సంస్థపై అధికార పార్టీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలేనన్న చంద్రబాబు... ఇసుక కొరత వల్ల 20 లక్షల మందికి పనులు లేవని చెప్పారు. తెదేపాకు ఓటు వేశారని ఊళ్లు ఖాళీ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు.
వైకాపా కార్యకర్తలను హద్దుల్లో పెట్టాలి...
పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరుండేవారా? అని నిలదీశారు. కార్యకర్తలను హద్దుల్లో పెట్టాలని వైకాపా అగ్రనేతలను కోరారు. ఎలాంటి గొడవలు లేకుండా చూసే బాధ్యతను పోలీసులు తీసుకోవాలని సూచించారు. దాడి బాధితులంతా తిరిగి గ్రామాలకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
రోడ్డుపై గోడ కట్టిన ఘటన ఎప్పుడన్నా చూశామా...
ఇప్పటివరకు ఏడుగురిని హత్య చేశారన్న చంద్రబాబు... 22 మందిపై భౌతిక దాడులు చేశారని గుర్తుచేశారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 మంది తెదేపా మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారన్న చంద్రబాబు... రోడ్డుపై గోడ కట్టిన ఘటన ఎప్పుడన్నా చూశామా..? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి... కానీ అధికారులు శాశ్వతమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఇదీ చదవండీ... వైకాపా నేతల జేబులు నింపడానికే.. ఇసుక కొరత