ముఖ్యమంత్రి జగన్ తీరుపై.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను.. జగన్ తప్పుబట్టడాన్ని ఖండించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి గురించి సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్య పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే ఉప రాష్ట్రపతి సూచించారని.. ఆ సూచన నచ్చితే పాటించవచ్చు లేదంటే వదిలేయవచ్చని కన్నా అన్నారు. గతంలో తెదేపా హయాంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు సమయంలో జగన్ తీవ్రంగా విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఇంగ్లీషు మీడియం వద్దని చెప్పినవాళ్లే.. ఇపుడు ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. నిర్బంధంంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. వెంకయ్యపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇసుక కొరత.. మద్యం పాలసీపై...
''రాష్ట్రంలో ఇంకా ఇసుక కొరత తీరలేదు. మద్యం పాలసీ వెంటనే అమలు చేసిన వాళ్లు ఇసుకను ఎందుకు ఆపి వేశారు? ఈ విషయంలో ముఖ్యమంత్రి రహస్య ఎజెండా ఏమిటో బయటపెట్టాలి. ఇసుక కొరత తీరకుండానే ఇపుడు సిమెంటు ధరలు పెంచారు. ఇది కూడా ప్రజలపై అదనంగా భారం మోపడమే అవుతుంది. గృహ నిర్మాణ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుత్సాహపర్చటం సరికాదు'' అంటూ ప్రభుత్వ తీరును కన్నా తప్పుబట్టారు.