పేదల గృహాలకు వైకాపా రంగు వేశారు ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టినా ఆ తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో కట్టించిన పేదల గృహాలకూ వైకాపా జెండా రంగులు అద్దుతున్నారు. అమరావతిలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన వెంకటపాలెం సమీపంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకోసం సుమారు 500 గృహాలను నిర్మించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ పథకాల కింద వీటిని నిర్మించారు. భవనంపైన నిర్మించిన వాటర్ ట్యాంకులకు వైకాపా రంగు వేశారు. వీటితో పాటు భవనాల బయట కూడా అదే రంగులు వేస్తున్నారు. విజయవాడ నుంచి సచివాలయానికి వెళ్లే కరకట్ట రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంబాలన్నింటికీ వైకాపా జెండా రంగులు అద్దుతున్నారు. కొద్ది రోజులుగా కొంత మంది కూలీలతో రంగులు వేయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెందిన విద్యుత్ స్తంభాలపై పార్టీ రంగులు వేయకూడదు. రహదారికి ఇరువైపులా ఓ వైపు వైకాపా జెండా రంగులు వేస్తుండగా.. మరో వైపు స్తంభాలకు వైకాపా నేతల ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు సహా ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి:
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి'