తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 13 అంశాలు అజెండాగా పొలిట్‌బ్యూరో భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న వివిధ ప్రజాసమస్యలపై పోరాటానికి వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థలు, సహాకార, పురపాలక, నగర పాలక తదితర ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అందులో పార్టీ అభ్యర్ధులు గెలిపించేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు తదితరులకు బాధ్యతలు అప్పగిస్తారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికలకు అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామ,వార్డు, మండల, డివిజన్, నగర కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం ఒక యూనిట్‌గా తీసుకుని అడ్‌హక్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. పార్టీకి అనుబంధంగా మొత్తం 16 అనుబంధ సంస్థలకు కార్యవర్గం ఏర్పాటు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంధానకర్తల నియామకానికి నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం యువత, మహిళలకే అధిక ప్రాధాన్యంపార్టీలోకి కొత్త తరాన్ని తీసుకురావడానికి 40శాతం యువతకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో మళ్లీ 33శాతం మహిళలకు కేటాయిస్తారు. పార్టీ కమిటీల నుంచి వివిధ కీలక పదవుల వరకూ అధిక శాతం యువతరానికి అవకాశం కల్పిస్తూ.. అవసరం మేర కొందరు సీనియర్ నేతలను పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇప్పటి నుంచే సంస్థాగతంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కొత్తగా ముగ్గురు పొలిట్‌బ్యూరోలోకిపదవుల్లో కీలక మార్పులు చేర్పులు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను తట్టుకోవాలంటే దీటుగా పార్టీలో యువ నాయకులతో పాటు మహిళలను ప్రోత్సహించాలన్నది అధినేత ఆలోచన. ఇందుకనుగుణంగా పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌తో పాటు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, వర్లరామయ్యను కొత్తగా పొలిట్‌బ్యూరోలోకి తీసుకోనున్నారు.
సమస్యలపై సమరశంఖంఇటీవల మృతిచెందిన పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి, గోదావరి పడవప్రమాద మృతులకు పొలిట్ బ్యూరో సంతాపం తెలపనుంది. ఇసుక సమస్యతోపాటు నిరుద్యోగ భృతి నిలిపివేత, తెదేపా కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసుల బనాయింపు, వేధింపులు, విద్యుత్ కోతలు, ఉపాధి హామీ నిధులు నిలిపివేత, మద్యం ధరల పెంపు జె-ట్సాక్స్ పేరిట వసూళ్లపై చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-అసత్య ప్రచారాలు, ప్రభుత్వ నిర్ణయాలు-అంతర్జాతీయంగా దిగజారిన రాష్ట్ర ప్రతిష్ఠ, ఉద్యోగుల తొలగింపు, గ్రామసచివాలయాల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు వివిధ సంక్షేమ పథకాల రద్దు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
ఇదీ చదవండి : 'తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు'