'మాతృత్వాన్ని మరిచి కన్నతల్లిపై హత్యాయత్నం ' వ్యసనాలకు బానిసైన కుమారుడు మాతృత్వాన్ని మరిచి డబ్బుల కోసం తల్లిపై హత్యాయత్నం చేసిన అమానవీయ ఘటన తెలంగాణ.. కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. కాగజ్నగర్ పట్టణం ఎఫ్.కాలనీకి చెందిన తాడూరు సంధ్యారాణి (45) భర్త చనిపోవడంతో అంగన్వాడీ ఆయాగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సంధ్యారాణికి ఇద్దరు సంతానం కాగా... కూతురుకి వివాహం చేసింది. కుమారుడు ప్రశాంత్ కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి మద్యం, గంజాయికి బానిసయ్యాడు. ఆరు నెలలుగా తనకు పెళ్లి చేయాలంటూ ఇంట్లో తరచూ తల్లితో గొడవ పడేవాడని ప్రశాంత్ సోదరి శ్వేత తెలిపారు. సంధ్యారాణి మద్యం మానేస్తేనే పెళ్లి చేస్తానని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకు తల్లితో గొడవపడి మద్యం, గంజాయి మత్తులో ఆమెపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన సంధ్యారాణిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు.