రాజధాని తరలింపు అంశంపై అమరావతి పరిరరక్షణ సమితి, రాజకీయ పార్టీలు పోరు ముమ్మరం చేశాయి. నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం నేతలను ఎక్కడిక్కడ గృహనిర్బంధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి బయలుదేరిన నేతలను అరెస్ట్ చేశారు.
తెదేపా నేతల హౌస్ అరెస్ట్...
శ్రీకాకుళంలో తెలుగుదేశం నేత కూన రవికుమార్ ఇంటివద్ద పోలీసులు మొహరించారు. నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తిని పోలీసులు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. పాలకొండలో తెలుగుదేశం నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సహా తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయనగరం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి అమరావతి బయలుదేరిన తెదేపా నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు చిన్నంనాయుడు, నియోజకవర్గ అధ్యక్షురాలు అధితి గజపతిరాజు సహా పలువురిని అశోక్ బంగ్లాలో అడ్డుకున్నారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్, మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణితో సహా పలువురు పార్టీ నేతలను పోలీసులు నిర్భంధించారు. విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పోలీసులు గృహ నిర్బంధించారు.
ఉభయగోదావరి జిల్లాల్లోనూ..
ఉభయగోదావరి జిల్లాల్లోనూ తెలుగుదేశం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల రాజాతోపాటు అనుచరులను అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీమంత్రి జవహర్‌ను గృహనిర్బంధించారు. ఆరిమిల్లి రాధాకృష్ణ, శేషారావును ఇంటినుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్యను, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహనిర్బంధించారు.
సీమలో అరెస్టులపర్వం...
రాయలసీమ జిల్లాల్లోనూ అరెస్టులపర్వం కొనసాగింది. కడపజిల్లా దుంపలగట్టులో వెంకటసుబ్బారెడ్డి సోదరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి వెళ్లేందుకు సిద్ధమైన వారితో పాటు కార్యకర్తలను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఉమామహేశ్వర్‌నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. రోళ్లలో ఐకాస నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురంలో తెలుగుదేశం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెనుకొండ నుంచి అమరావతి బయలుదేరిన తెలుగుదేశం నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధించారు.చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతల గృహ నిర్బంధాలు, అరెస్ట్‌లను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ముందస్తుగా నిర్బంధించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఇదీ చదవండి : 'నియమాలకు విరుద్ధంగా చట్టసభల్లోకి ప్రవేశిస్తే శిక్షార్హులే'